Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

రాఖీ కట్టిస్తే .....తలతిక్కతగ్గుతుంది

సార్ ,..ఇక చదువులు చెప్పలేంసార్ .మీరే ఎదో ఒకటి చేయాలి అంటూవచ్చాడు మా స్కూల్ లో సోషల్ మాస్టర్ నీలకంఠేశ్వరరెడ్డి గారు.

ఏమైందిసార్ .అనడిగాను

ఏమైందేమిటిసార్ .పిల్లలకు వయస్సుకుమించిన ఆలోచనలు .మేము పాఠం చెబుతుంటే ముసిముసి నవ్వులు వంకచూపులు , కొత్తగావచ్చినవాల్లతో మరీ ఇబ్బంది సార్ టెన్త్ లో . ఈసినిమాలు మరీ చెడగొడుతున్నాయి పిల్లలను వెధవలు జోకులొకటి..........
మనం చదువుకునేప్పుడు పదవతరగతి లో ఇలా ఆడపిల్లలతో మాట్లాడాలంటే ఎంత భయం సార్ ..మనకు ఆయన తనగోడు వెల్లబోసుకుంటున్నాడు.
నిజమే మాస్టారూ అన్నాను నేను .[ అప్పట్లో పదవతరగతి ఆడపిల్లలంటె అదొక ప్రత్యేక వర్గం వి ఐ.పి. లన్నమాట .పంతుల్లుకూడా కొట్టరు వాల్లకు మార్కులు తగ్గినా .మాకైతే వీపు విమానం మోతమోగేది .అలాంటి రోజులలో ఆడపిల్లలతో మాట్లాడటం కూడానా! ?]

మాకు ఇక్కడ పల్లెటూళ్ళలో ఎనిమిది తొమ్మిది దాకా గవర్నమెంట్ స్కూల్లోనో .లేక బయట వినుకొండ ,దర్శి లాంటి పట్టనాలలోనో చదివించి ఆతరువాత అలివిగాని బాచ్ లను ..ఇహ లాభం లేదు ..దుర్గా సార్ దగ్గరైతే అణగేస్తాడు అని తెచ్చి నాపాలిట పడేసి పోతుంటారు. తప్పదు మొహమాటాలు కనుక చేర్చుకోవటం . వీల్లలో చాలామండికి చదువు తక్కువైనా కళలు ఎక్కువ .పదవతరగతి కొచ్చేస్తారు గనుక కాస్త మాటతీరు మనసుతీరు కూడా తేడావస్తుంది. ఇక మనసినిమాల పుణ్యమా అని ఆఅతితెలివి కూడా పెరిగిపోతుంది. నాదగ్గర చిఅన్నతనం నుంచి చదివిన పిల్లలు పరవాలేదుగానీ ఇలా తొమ్మిది పదులలో చేరేవాల్లతో కాస్త తలనొప్పి. దానికితోడు మా మాస్టర్లు పిల్లల్తో స్నేహితుల్లా మెదిలితే బాగ చదువస్తుందనుకుంటారేమో వాల్లిచ్చేచనువెక్కువై పోతుంది ఒకోసారి.

అసలే పోర్షన్లు కాక మనం అల్లాడుతుంటే ఇదొక గోల . చదువని చెబుదామా ,కాపలాలు కాద్దమా ఏమిటో సార్ గట్టీగా కొడదామంటే చిన్నపిల్లల్లా లేరు ఇప్పుడు కాలం మారింది. ఏ అఘాయిత్యాలు చేసుకుంటారో ... అయన మరీ భయస్తుడు ఆయన భయం నాకెక్కిస్తున్నాడనిపించింది.
ఆడపిల్లలు జాగ్రత్తగావుంటూన్నారా ? అడిగాను
అమ్మో ! దొంగముండలు ..వాల్లలో కూడా కొంతమంది తో జాగ్రత్తగా వుండాలిసార్ ,మీరొస్తున్న అలికిడైతే చాలు బుద్దిమంతుల్లా తెగ నటించేస్తుంటారు . క్లాసులో ఒకటే గోల వాల్లది కూడా .

సరేలెండి కొడితే లాభం లేదు . నాలుగురోజులాగండి అని చెప్పిపంపించా ఎవరెవరు కాస్త ఎక్స్ ట్రా గాల్లో కనుక్కుని .

[ఈసందర్భంగా నాకోసన్నివేశం గుర్తొచ్చింది . మేము డీగ్రీ చదివేరోజులలో మక్కెన శ్రీను అనేవాడూండేవాడూ ఫైనలియర్ లో .వాడూ రౌడీ షీటర్ కూడా . మాముందు వాడు కాలరెగరేస్తూ ఆదపిల్లలదగ్గరకెల్లేవాడూ మాట్లాడాలని .వాల్లు పళ్ళుతెగ ఇకిలిం చేస్తూ ఏంటన్నాయ్యా ... అని పలకరించేవాల్లు .అంతేవాడు కాలర్ దింపి పాతసినిమాలో ఎన్టీఆర్ లా చూదండమ్మా మీకేదన్నా అవసరమయితే నన్నడగండి ,మీకేంభయం లేదు నేనున్నానని హామీ ఇచ్చేసి వచ్చేవాడు .పాపం వాడి బ్రతుకంతా అఖిలాంధ్ర ఆడపిల్లలకు అన్నయ్యగా మిగిలిపోయింది .]


ఇక పదవతరగతి వాల్లకు ఆఫీస్ లోకి పిలచి చెప్పాను . ఒరే ..అబ్బాయిలూ రేపు రాఖీ పండుగరోజు చిన్న పార్టీ చేకుందాము తలా ఓపాతికా పట్రాండ్ర్రా అని . అలాగే ఆడపిల్లల దగ్గర తలా ఓ పాతిక వసూలుచేసి వాల్లకు చెప్పకుండా చిన్నసైజ్ రాఖీలి తలా ఓపదిహేను తెప్పించాను .

ఈరోజు ప్రేయర్ లో రాఖీపండుగ గురించి చెప్పి ,దాని ప్రాముఖ్యతన్చెప్పి అన్నయ్యలు తమకు రక్షగావుండాలని చెల్లెల్లు అక్కలు ఇలాకట్టాలిరా .చూడండి మన పదవతరగతి వాల్లు ఎంతచక్కగా .సామూహికంగా చేసుకుంటున్నారో ఈపండుగ అని ప్రకటించేశా .పక్కలోబాంబులు పడ్డట్టు బిత్తరచూపులు చూస్తున్న వారిలో కొంతమందిని క్రీగంట గమనిస్తూ మీరుకూడా అలా పదవతరగతి వాల్లలా కల్సి మెలసివుండాలి .అర్ధమైనదా ? అంటూ సాగించా నా వుపన్యాసాన్ని.

ఆతరువాత పదవతరగతి మగపిల్లలనందరినీ ఒకవరుస నిలబెట్టి , ఆక్లాస్ ఆడపిల్లలందరిచేత వరుసగా అందరికీ రాఖీలు కట్టీంచా మిగతవారిచేత చప్పట్లు కొట్టిస్తూ ,ఒక్కొక్కడి ముఖం చూడాలి . మాస్టర్లు నవ్వలేక చస్తున్నారు అవతల . కొద్దిసేపటికి రాఖీలుకట్టీంచుకుంటున్న పిల్లకాయలకు తప్పలేదు నవ్వటం . తరువాత వాల్లచేత మాట్లాడించా . ఒక్కొక్కడూ మాక్లాసు ఆడపిల్లలు మాకు అక్కలు చెల్లెల్లుఅంటూ మనపాఠశాలలో మనమందరం ఒకేతల్లిపిల్లల లాంటివారము అంటూ చెప్పకతప్పలేదు ,ఎందుకంటే వాడికంటె ముందువాడిలా మాట్లాడకుంటే ఎక్కడ తప్పుపడతారోనని.

ఇప్పటివరకు పంతుల్లను జోకర్లుగా చిత్రిస్తున్న సినిమా వాల్లు మాలాంటి వారి విలనిజాన్ని కూడా చూపించుకోండి అని సలహా ఇస్తున్నాను.

స్పందనలు

Re: రాఖీ కట్టిస్తే .....తలతిక్కతగ్గుతుంది

నిరాకరణ